భానుపురి (సూర్యాపేట) : నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్‌కి చేరుకుంది, ఇకపై వర్షాలు వచ్చే అవకాశం కూడా లేనందున సాగర్ ఆయకట్టు రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేసేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్‌నినో పరిస్థితులు, ఆరుతడి పంటల సాగు, పౌర సరఫరాలపై వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన వన, ఇరిగేషన్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులలో నీరు డెడ్ స్టోరేజ్‌కి చేరినందున తాగునీటికి మాత్రమే నీటిని వదులుతారని తెలిపారు. జిల్లాలోని రైతులు వరికి బదులుగా పెసలు, కందులు, మినుములు, కూరగాయలు పండించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, హార్టికల్చర్ అధికారి నాగయ్య, డీఆర్‌డీఓ సన్యాసయ్య, జడ్పీ సీఈఓ శిరీష పాల్గొన్నారు.
అన్ని సూచనలతో జనగణన హ్యాండ్‌బుక్
జనగణన సంచాలకులు ఇచ్చిన అన్ని సూచనలను జిల్లాలో కచ్చితంగా అమలు చేసి జనగణన హ్యాండ్‌బుక్‌ను తయారు చేస్తామని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై కలెక్టర్లతో జనగణన సంచాలకులు భారతి హోళీకేరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత శాఖల నుంచి నిర్ణీత నమూనాలో సమాచారం సేకరించి, గడువులోపు పూర్తి స్థాయిలో పరిశీలించి, జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌కు సంబంధించిన వివరాలు, సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, సీపీఓ కిషన్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


