సూర్యాపేటటౌన్ : బుల్లెట్ రైలు మార్గం అలైన్ మెంట్‌లో మార్పులతో నేషనల్ హైవే– 65 వెంట ఉన్న ప్రాంతాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మొదట జాతీయ రహదారి–65కు సమాంతరంగా బాటసింగారం, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, మునగాల, కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ మీదుగా అమరావతి రూట్‌ను ప్రకటించారన్నారు. ఆంధ్రా ప్రాంత పెత్తందారుల ఒత్తిళ్లు, కొంతమంది పాలకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రస్తుతం రూట్‌మ్యాప్‌ను శంషాబాద్ నుంచి హాలియా మీదుగా అమరావతికి మార్చారని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆవుల నాగరాజు, ధనియాకుల శ్రీకాంత్, పుల్లూరి సింహాద్రి, తగుళ్ల జనార్దన్, శ్రీకాంత్, భాషపంగు సునీల్, బొమ్మగాని వినయ్, పోలోజు మహేష్, తదితరులు పాల్గొన్నారు.


