రైతులు సద్వినియోగం చేసుకోవాలి
● డ్రిప్, మల్చింగ్ పద్ధతులు వాడటం వల్ల వరి, పత్తి సాగుతో పోలిస్తే దాదాపు 40 శాతం వరకు నీరు ఆదా అవుతుంది.
● శాశ్వత పందిళ్లతో నాణ్యమైన దిగుబడి వస్తుంది. కాయలు నేలకు తగలకుండా, పురుగుల బెడద లేకుండా గుణాత్మకమైన అధిక దిగుబడులు సాధించవచ్చు.
● తక్కువ కాలపరిమితిలో కోతకు వచ్చే కూరగాయలు రైతులకు నిరంతరం ఆదాయాన్ని అందిస్తాయి.
సూర్యాపేట : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగు బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కువ నీరు అవసరమయ్యే సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, తక్కువ కాలపరిమితిలో అధిక లాభాలందించే కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని ఉద్యాన శాఖ అధికారులు సూచింస్తున్నారు. ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ సాగునీటితోనే బంగారు పంటలు పండించవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు.
జిల్లాలో సాగు విస్తీర్ణం..
వాతావరణ మార్పుల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో సుమారు 23 వేల ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ఇప్పటివరకు కేవలం 2,350 ఎకరాల్లో మాత్రమే సాగు జరుగుతున్నట్లు ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలను ప్రకటిస్తోంది. ఎక్కడైనా విత్తనాలు లేదా నారు కొనుగోలు చేసి నాటుకున్న బిల్లులను సమర్పిస్తే, ఎకరానికి రూ.9,600 (50 శాతం సబ్సిడీ) చొప్పున అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ అందిస్తున్న
ప్రధాన సబ్సిడీలు, పథకాలు
కూరగాయల విస్తరణ పథకం: హైబ్రిడ్ కూరగాయల సాగు విస్తరణకు ఎంఐడీహెచ్ కింద ఎకరానికి రూ.9,600 (50 శాతం సబ్సిడీ) ఆర్థిక సహాయం అందజేస్తారు.
ప్లాస్టిక్ మల్చింగ్ (ఎంఐడీహెచ్) : నేలలో తేమ ఆవిరి కాకుండా కాపాడుతూ, కలుపు నివారణకు ఉపయోగపడే మల్చింగ్ షీట్ల కొనుగోలుపై ఎకరానికి రూ.8,000 (50 శాతం సబ్సిడీ) లభిస్తుంది.
శాశ్వత పందిళ్లు (ఆర్‌కేవీవై) : సొర, కాకర, బీర వంటి తీగజాతి కూరగాయల నాణ్యమైన సాగు కోసం వేసే శాశ్వత పందిళ్ల నిర్మాణానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎకరానికి రూ.లక్ష (50 శాతం సబ్సిడీ) అందజేస్తున్నారు.
వీబీజీ రాంజీ (ఉపాధి హామీ) అనుసంధానం
వికసిత్ భారత్–గ్యారంటీ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ రాంజీ ) ద్వారా పందిళ్ల నిర్మాణం, తోటల పెంపకం, ఫీల్డ్ పనులకు కూలీల వేతనం రూపంలో అదనపు ఆర్థిక సహాయం అందుతుంది.
బిందు సేద్యం (టీజీ ఎంఐపీ)
తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ప్రతి నీటి బొట్టు సమర్థవంతంగా వినియోగించుకునేలా ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు పంపిణీ చేస్తున్నారు.
ఫ జిల్లాలో 23 వేల ఎకరాల్లో సాగు లక్ష్యం
ఫ రైతులపై భారం తగ్గించేందుకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం
ఫ ఆధునిక పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు
ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మళ్లాలి. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు తమ పరిధిలోని ఉద్యాన విస్తరణ అధికారులను లేదా సూర్యాపేట జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.
– తీగల నాగయ్య,
జిల్లా ఉద్యానపట్టు పరిశ్రమల అధికారి


