భానుపురి (సూర్యాపేట) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ వీసీ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం జూలై 24 తో ముగియాల్సిన బీఎల్‌ఓల ఇంటింటి సర్వే గడువును.. క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆగస్టు 10 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడం, చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండడం వంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ సమీక్షలో కొత్త పోలింగ్ స్టేషన్లపై రాజకీయ పార్టీ నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, సి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, సీహెచ్ రాజేశ్వరరావు, చల్లమల్ల నరసింహ, ఎండీ హాబిద్, ఎం. స్టాలిన్, కరుణాకర్ రెడ్డి, డి.రమేష్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్


