విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

Aug 7 2026 3:59 AM | Updated on Aug 7 2026 3:59 AM

సూర్యాపేట టౌన్‌ : విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి (డీఐఈఓ) సులోచన రాణి అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం విద్యార్థులకు నోట్‌బుక్‌లు, స్కూల్‌ బ్యాగులు, షూస్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇటీవల నీట్‌ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, డిజిటల్‌ బోధన, ప్రత్యేక కోచింగ్‌, ఇలా ఎన్నో ఉచిత సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.అనంతరం కళాశాలలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యుత్‌ కోతలపై రైతుల నిరసన

పాలకవీడు : పాలకవీడు మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను గురువారం రైతులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో తరచూ ఇష్టానుసారంగా కోతలు విధిస్తుండడం వల్ల పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లు, బావుల సాయంతో సాగు పనులు చేపట్టిన రైతులకు మోటార్లు సక్రమంగా నడవక ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే ఉండాల్సి వస్తోందని వాపోయారు. రోజుకు పది నుంచి పదిహేను విడతలు కరెంటు వచ్చిపోతుండడంతో పొలాలకు నీరు పారించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ విద్యుత్‌ కోతలు విధించడం వల్ల మోటార్లు ఒత్తిడికి గురై కాలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. మండల విద్యుత్‌ అధికారి శ్రీనివాస్‌ స్పందించి.. విద్యుత్‌ సరఫరాను మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement