ఇప్పుడే నిర్ణయం తీసుకోలేం
నాగార్జునసాగర్ : కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురింపజేస్తోంది. సాగర్‌కు ఎగువన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో నాలుగైదు రోజుల్లో గరిష్టస్థాయికి చేరవచ్చని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు (215టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రానికి నీటిమట్టం 871.70 అడుగులకు (149 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి శ్రీశైలానికి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం నమోదవుతోంది. జలాశయంలో నీటి నిల్వలు పెరగడంతో ఎడమ వైపు గల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తూ నాగార్జునసాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 6,589 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పాదన ద్వారా నాగార్జునసాగర్ జలాశయానికి వదిలారు. దీంతో సాగర్ జలాశయం నీటిమట్టం కూడా క్రమంగా పెరగనుంది. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు)కాగా. ప్రస్తుతం 513.40 అడుగులు (137 టీఎంసీలు) ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటే.. త్వరలోనే నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మరింత పెరుగుతాయి. దీంతో ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు.
సెప్టెంబర్‌లోనైనా సాగునీరివ్వొచ్చు..
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైప్పటి నుంచి సాగునీటి కొరతతో సాగర్ ఆయకట్టు ప్రాంత రైతులు వరినార్లు పోయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే, కృష్ణానది పరవళ్లు తొక్కుతుండటం, శ్రీశైలం నుంచి సాగర్‌కు స్వల్పంగా నీటి విడుదల కొనసాగతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలోపు ఎడమ కాల్వకు నీరు విడుదలైతే ఆలస్యమైనా వరి, పప్పుధాన్యాల వంటి పంటలను సాగు చేసి కనీసం ఒక పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2017లో కూడా సెప్టెంబర్ నెలలోనే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసినప్పటికీ రైతులు విజయవంతగా పంటలు సాగు చేసి మంచి దిగుబడులు సాధించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇదే పరిస్థితి ఈసారి కూడా పునరావృతమవుతందనే నమ్మకంతో ఆయకట్టు రైతులు కృష్ణమ్మ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఎగువ నుంచి వరద ప్రవాహం ఇలాగే కొనసాగి సాగర్ జలాశయం గరిష్టానాకి చేరుకుంటే తప్ప ఇప్పుడే నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేము. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు తాగునీటి సరఫరా సాగర్ జలాశయంపై ఆధారపడి ఉంది. సాగర్ ఆయకట్టు మూడు లక్షల ఎకరాలతో పాటు, ఎస్‌ఎల్‌బీసీ రెండు లక్షల ఎకరాలకు నీరందించాలి.
–చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌రెడ్డి
కృష్ణమ్మ పరుగులు
ఫ శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద
ఫ విద్యుదుత్పాదన ద్వారా సాగర్‌కు నీటి విడుదల
ఫ ఆలస్యంగానైనా సాగునీరు ఇవ్వొచ్చంటున్న రైతులు


