పోటీ తత్వంతోనే ఉన్నత శిఖరాలు | - | Sakshi
Sakshi News home page

పోటీ తత్వంతోనే ఉన్నత శిఖరాలు

Aug 6 2026 7:56 AM | Updated on Aug 6 2026 7:56 AM

సూర్యాపేటటౌన్‌ : ప్రతి విద్యార్థి ప్రాథమిక స్థాయి నుంచే పోటీ తత్వంతో ముందుకు సాగితేనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన ఫౌండేషన్‌ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలో నాణ్యమైన విద్యనందించేందుకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నవోదయకు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 10 కంప్యూటర్లతో కూడిన ల్యాబ్‌, లైబ్రరీని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. అద్దె భవనంలో ఉన్నప్పటికీ విద్యార్థులకు మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కోదాడలో నవోదయ విద్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఏడాదిన్నర కాలంలో భవనం అందుబాటులోకి వస్తుందన్నారు.

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన కలెక్టర్‌..

తన చిన్ననాటి సైనిక్‌ స్కూల్‌ జ్ఞాపకాలను కలెక్టర్‌ విద్యార్థులతో పంచుకున్నారు. నేను కూడా మీలాగే ఆరో తరగతిలో ఇల్లు వదిలి సైనిక్‌ స్కూల్‌లో చేరాను. నాతో పాటు చదివిన బ్యాచ్‌మేట్స్‌లో 22 మంది ఈరోజు డిఫెన్స్‌, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాల్లో ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తున్నారని, ముగ్గురికి శౌర్య చక్ర అవార్డులు వచ్చాయని తెలిపారు. నవోదయ విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులుగా మాత్రమే కాకుండా దేశాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ రోజువారీ మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నవోదయ ప్రిన్సిపాల్‌ ఆదినారాయణ, ఉపాధ్యాయులు రాధాకృష్ణ, గంగాభవాని, జ్ఞానేశ్వరి, రాంబాబు, వైష్ణవి, స్వాతి, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement