ఒకేసారి రద్దు చేయకుండా..
భానుపురి (సూర్యాపేట) : ధరణి ఆపరేటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భూ భారతి అమలుతో వారి ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొంది. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల బాధ్యతలను జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఇప్పటివరకు పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జిల్లాలో 19 మంది ఆపరేటర్లు
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 19 మంది ధరణి ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం 2018 సంవత్సరంలో ధరణి పోర్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి కార్యాలయానికి ఒక ధరణి ఆపరేటర్ చొప్పున నియమించారు. ఈ లెక్కన జిల్లాలో 23 మండలాలకు 23 మందిని నియమించారు. అయితే పలు సందర్భాల్లో అవినీతి అక్రమాలు, నిర్లక్ష్యం తదితర కారణాలతో నలుగురు ధరణి ఆపరేటర్లను తొలగించగా ప్రస్తుతం జిల్లాలో 19 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
భూ భారతి అమలుతో..
కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి విధానాన్ని తీసుకొచ్చింది. అయితే గతంలో ధరణి పోర్టల్ ద్వారా చాలా అవినీతి అక్రమాలు జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీనికి ప్రధానంగా ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే ధరణి ఆపరేటర్లుగా పనిచేసే ఉద్యోగుల ద్వారానే ప్రభుత్వ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో ఈ విధానాన్ని చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన రైతుల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేపట్టే ఆపరేటర్లు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉండడంతో వీరంతా ప్రభుత్వం ఉద్యోగులుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
ఆపరేటర్లను తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం
ఫ జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించే యోచన
ఫ వివరాల సేకరణలో యంత్రాంగం
ఫ ఆందోళనలో కంప్యూటర్ ఆపరేటర్లు
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ధరణి ఆపరేటర్ల సేవలను రద్దు చేయకుండా సగానికి పైగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలో 19 మంది ధరణి ఆపరేటర్లు పనిచేస్తుండగా వీరిలో కేవలం 7 నుంచి 8 మంది ధరణి ఆపరేటర్లను మాత్రమే కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమచారం. మిగతా వారి భవిష్యత్తు ప్రశ్నార్థంకంగా మారగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 19 మంది ధరణి ఆపరేటర్లలో ఎవరు ఉంటారు..? ఎవరు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సి వస్తుందన్న ఆందోళనలో పడ్డారు.


