ఫ సూర్యాపేట జిల్లాకు కొత్తగా గతేడాది నవోదయ విద్యాలయం మంజూరు
ఫ 2027–28 విద్యాసంవత్సరానికి
ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు
ఫ రేపటి వరకు గడువు
ఫ నవంబర్ 28న ప్రవేశ పరీక్ష
ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఉచిత విద్య, వసతి, పోషకాహారం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, క్రీడలు, కంప్యూటర్ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేసే విద్యాసంస్థగా నవోదయ విద్యాలయాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి.
సూర్యాపేటటౌన్ : అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయా (జేఎన్‌వీ)లు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. 2027–28 విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ఇది వరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దరఖాస్తుల గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించింది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రవేశం కల్పించి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అందిస్తారు.
జిల్లాకు తొలి నవోదయ స్కూల్..
సూర్యాపేట జిల్లాకు తొలిసారిగా గత ఏడాది మొదటి జవహర్ నవోదయ విద్యాలయం మంజూరైంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనం నిర్మాణానికి కోదాడ పట్టణంలో అన్ని వసతులతో కూడిన స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. పనులు పూర్తయిన తర్వాత విద్యార్థులకు సొంత భవనంలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన జరగనుంది. ప్రస్తుతం సూర్యాపేటలో కొనసాగుతున్న నవోదయంలో రెండు బ్యాచ్‌లు కొనసాగుతుండగా మూడో బ్యాచ్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు.
అర్హులు ఎవరంటే..
2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత నవోదయ విద్యాలయం ఉన్న ఉమ్మడి జిల్లా పరిధిలో నివాసితులై ఉండాలి. 2015 మే 1 నుంచి 2017 జూలై 31 మధ్య జన్మించిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
గ్రామీణ విద్యార్థులకు తొలి ప్రాధాన్యం
నవోదయ విద్యాలయం ప్రవేశాల్లో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయించారు. ఇందుకు వారు మూడో, నాలుగో, ఐదో తరగతులను గ్రామీణ పాఠశాలల్లోనే అభ్యసించి ఉండాలి. మొత్తం సీట్లలో కనీసం మూడో వంతు బాలికలకు కేటాయించగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తింపుజేస్తారు.
100 మార్కులకు ప్రవేశ పరీక్ష
మొత్తం 40 సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఆర్థమెటిక్, లాంగ్వేజ్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి 100 మార్కులకు 80 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, మరాఠీ, కన్నడ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
విద్యార్థి ఫొటో, విద్యార్థి సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్ వివరాలు, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలతో ఈనెల 7వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఫలితాలను 2027 మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రకటిస్తారు.


