సూర్యాపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈనెల 2న అమరవీరుల యాదిలో పేరిట మహబూబాబాద్‌లో ప్రారంభమైన గీతన్నల చైతన్య యాత్ర బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఖమ్మం క్రాస్ రోడ్‌లో యాత్ర బృందానికి కార్మికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ మీదుగా పబ్లిక్ ఆడిటోరియం వరకు మోకు, ముస్తాదులు, తాటి, ఈత కొమ్మలు చేత పట్టుకొని మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జీవో ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులందరికీ పింఛన్ ఇవ్వాలన్నారు. ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటి తాటి, ఈత చెట్లకు ప్రభుత్వం నంబర్లు వేసి సంరక్షించాలని కోరారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ మాట్లాడుతూ నీరాకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.25 కోట్లు, కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించి రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు చౌగాని సీతారాములు, గౌని వెంకన్న, కొండం కరుణాకర్, మడ్డి అంజిబాబు, గౌని సాంబయ్య, తుమ్మల సైదయ్య, ఉయ్యాల నగేష్, గుణగంటి కృష్ణ, బత్తుల జనార్దన్, బోడపట్ల జయమ్మ, కృష్ణ, నాగ మల్లయ్య, బోడపట్ల సుదర్శన్, సుధాకర్, నరసయ్య, రాజేష్ గౌడ్, శ్రీను, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు


