భానుపురి (సూర్యాపేట), మేళ్లచెరువు : మేళ్లచెరువు మండల కేంద్రం పరిధిలోని శ్రీనివాస సాయి శివాయ రైస్ ఇండస్ట్రీస్‌లో రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో దాదాపు రూ.48 కోట్ల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రబీ 2022–23, రబీ 2023–24, ఖరీఫ్ 2024–25, రబీ 2024–25 సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలను పరిశీలించగా ఆన్‌లైన్ రికార్డులు, స్టాక్ వివరాలు, మిల్లులో భౌతికంగా ఉన్న నిల్వల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. ప్రాథమిక పరిశీలనలో యాక్షన్ ధాన్యాన్ని మినహాయించి సుమారు 19,843.429 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయమైందని గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.48 కోట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. అదేవిధంగా, రబీ 2022–23 సీజన్‌కు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు రూ.5.66 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉన్నట్లు కూడా గుర్తించారు. అన్ని సీజన్లలో కలిపి ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం విలువ, బకాయిలను కలిపి సుమారు రూ.53.66 కోట్ల మేర నష్టం సంభవించినట్లు అధికారుల బృందం ప్రాథమికంగా నిర్ధారించింది. పూర్తి స్థాయి విచారణ అనంతరం తుది నివేదికను సంబంధిత ప్రభుత్వానికి సమర్పించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో రీజినల్ విజిలెన్స్ అధికారి ప్రతాప్, సభ్యులు సీఐ గౌస్, డీటీసీఎస్‌లు రాజశేఖర్, గిరిప్రసాద్, టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మేళ్లచెరువులోని రైస్ ఇండస్ట్రీస్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
మరో రూ.5.66 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తింపు


