నడిగూడెం : ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో బావులు, బోర్లు, చెరువుల కింద వరి నాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరి పొలంలో కాలిబాటలు తీయిస్తే పెట్టుబడులు తగ్గడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ చెబుతున్నారు. వరి పొలంలో కాలిబాటలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, పైరుపై చీడపీడల సమస్య కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు.
వరి పొలంలో కాలిబాటలపై ఆయన సలహాలు, సూచనలు ఇవీ..
పాటించాల్సిన విధానం..
కాలిబాటలు తీసుకునే సమయంలో రైతులు పొడవైన ప్లాస్టిక్ తాడును గట్టుకు ఒకవైపు నుంచి రెండో వైపునకు సాగదీసి కట్టాలి. తాడు వెంబడి 12 సెం.మీ. వెడల్పున వరి నాట్లు తొలగించి పక్కనే పలుచగా ఉన్నచోట నాటుకోవాలి. చేను గట్టు పక్క నుంచి అడుగు దూరంలో కాలిబాట వేసి అక్కడి నుంచి ప్రతి రెండు మీటర్ల దూరంలో ఒక కాలిబాట తీయాలి. కొందరు రైతులు ప్రతి 6 నుంచి 7 మీటర్లకు ఒక కాలిబాట తీస్తుంటారు. దీని వల్ల ప్రయోజనం ఉండదు. ముందు నాట్లు వేసిన తర్వాత రైతులు గట్లకు ఇరువైపులా తాడు కట్టి మార్క్ చేసిన చోట ఉన్న మొక్కలను తీసివేసి కాలిబాట తీస్తుంటారు. వెదజల్లే పద్ధతిలో పైరు ఎదుగుతున్న సమయంలో 15 నుండి 20 రోజుల వ్యవధిలో 20 సెం.మీ. వెడల్పులో వరి నాట్లు తొలగించి కాలిబాట వేసుకోవచ్చు.
ఇవీ ప్రయోజనాలు..
కాలిబాటతో పైరు మొదళ్ల వరకకు వెలుతురు, గాలి తగులుతుంది. దీంతో పైరు ఆరోగ్యవంతంగా ఎదుగుతుంది. చీడపీడల బెడద కొంతవరకు తగ్గుతుంది. కాలిబాట మార్గంలో వెళ్లి కలుపు మొక్కలు తొలగించడానికి, మందులు చల్లుకోవడానికి వీలవుతుంది. తెగుళ్లు గుర్తించి సస్యరక్షణ చర్యలు తీసుకోవడానికి, ఎలుకల నివారణకు కాలిబాటలు ఉపయోగపడతాయి. తుఫానులు, భారీ వర్షాలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు పంట చేలలో కిరణజన్య సంయోగక్రియ సమర్ధవంతంగా జరిగి దిగుబడి పెరుగుతుంది. పైరులో చీడపీడల ఉధృతిని అతి సమీపం నుంచి గమనించి, దానికి అనుగుణంగా సకాలంలో సస్యరక్షణ తీసుకునే వీలు ఉంటుంది.
ఫ నడిగూడెం మండల వ్యవసాయాధికారి మల్సూర్ సూచనలు


