చిలుకూరు: మండలంలోని రామాపురంలో ఉన్న రైస్‌మిల్లు, గోదాంలో శనివారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారంటూ శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పోలీస్, సివిల్ సప్లై అధికారులు స్పందించారు. వారు రామాపురంలోని రైస్‌మిల్లుతో పాటు గోదాం, కోదాడ మండలం ద్వారకుంట ఆటోనగర్‌లోని రెండు గోదాంలు, చిలుకూరులోని రెండు గోదాంలను తనిఖీ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సీఎంఆర్ ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మోహన్, సవిల్ సప్లై డీటీసీఎస్ రాజశేఖర్, ఆర్‌ఐలు కృష్ణారెడ్డి, గిరిప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


