హుజూర్‌నగర్ : పొలాలకు సారు నీరందించే లిఫ్ట్‌లను రైతులు తమసొంత ఆస్తిగా భావించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. లిఫ్ట్‌ల నిర్వహణపై గురువారం హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని రైతులు, ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ అధికారులతో కలిసి హుజూర్‌నగర్‌లోని టౌన్ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్లను రైతులు తమ సొంత ఆస్తిగా భావించి రక్షించుకోవాలన్నారు. రైతుల ప్రయోజనాల కోసం, సాగునీటి లిఫ్టుల్లో దొంగతనాల నివారణకు అన్ని శాఖలను ఒకే వేదికపైకి తెచ్చి అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్పీ నరసింహను, జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎమ్మెల్యే అభినందించారు.
చోరీలు జరిగితే నష్టపోయేది రైతాంగమే..
లిఫ్ట్ ఇరిగేషన్లలో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు, వైర్లు, ఆయిల్ దొంగతనానికి గురైతే తీవ్రంగా నష్టపోయేది రైతాంగమేనని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. దొంగతనాలు జరిగాక పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి నిందితులను పట్టుకొని సొత్తు రికవరీ చేస్తున్నారని, అయితే దొంగతనాలు జరగకుండా ముందస్తుగా అడ్డుకోవడమే ముఖ్యమని అన్నారు. లిఫ్ట్‌ల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి లిఫ్ట్ పరిధిలో రైతులు సహకార సొసైటీలు, కమిటీలుగా ఏర్పడి నిరంతరం పర్యవేక్షించుకోవాలన్నారు. రైతు కమిటీల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం, మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. ప్రజల్లో ఐకమత్యం, సామాజిక బాధ్యత పెరిగినప్పుడే దొంగతనాలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. పోలీసు శాఖ తరఫున లిఫ్టుల వద్ద పాయింట్ బుక్స్ ఏర్పాటు చేసి, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సూర్యనారాయణ, నీటిపారుదల సీఈ నాగభూషణం, విద్యుత్ డీఈ రామ్మోహన్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ చరమందరాజు, తహసీల్దార్ కవిత, నీటిపారుదల, వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి


