సూర్యాపేటటౌన్ : ఒక చినుకు వర్షం పడితే చాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రహదారులు బురదమయంగా మారుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పైప్‌లైన్ పనుల కోసం తవ్విన గుంతలను మట్టితో పూడ్చినప్పటికీ సీసీ నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా మట్టి రోడ్లలన్నీ బురదమయంగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు, ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా రోడ్లపై రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నెలలు గడుస్తున్నా పట్టించుకోవట్లే!
ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన సూర్యాపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేపట్టారు. పనులు ముగిసిన చోట వెంటనే రోడ్లను యధాస్థితికి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ, నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో చిరుజల్లులకు సైతం మట్టిరోడ్లన్నీ బురదతో దర్శనమిస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్‌కు ఆటంకం కలగడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి.
అన్ని కాలనీల్లోనూ ఇదే సమస్య
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులకు చెందిన రోడ్లలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం తవ్వి పైపులు వేసి పూడ్చారు. అనంతరం మట్టి రోడ్లపై సీసీ వేయలేదు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య నెలకొనడంతో ప్రజలు సంబంధిత శాఖల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్లపై సీసీ లేదా డాంబర్ వేయించి తమ ఇబ్బందులు తీర్చాలని పట్టణవాసులు కోరుతున్నారు.
యూజీడీ పనులతో పట్టణ రోడ్లు అధ్వానం
గుంతలు పూడ్చి సీసీ నిర్మాణాలు
చేపట్టని కాంట్రాక్టర్లు
ఇబ్బందుల్లో వాహనదారులు,
పాదచారులు


