అర్వపల్లి : తుంగతుర్తి నియోజకవర్గంలో పూర్తిగా గోదావరి జలాలపైనే ఆధారపడి రైతులు పంటలు సాగుచేస్తున్నారు. అయితే 2019 నుంచి రెగ్యులర్‌గా గోదావరి జలాలను వదులుతున్నారు. దీంతో రైతులు ఎన్నో ఏళ్లుగా పడావుపడిన భూములను సాగులోకి తెచ్చారు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యాంలు అడుగంటి ప్రస్తుతం తాగు నీటి అవసరాలకు మాత్రమే సరిపోను నీళ్లు ఉన్నాయి. దీంతో ఈ సీజన్‌లో ప్రాజెక్టు రెండో దశ కాల్వలకు నీళ్లు ఇవ్వలేమని నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సీజన్‌లో గోదావరి జలాలు వచ్చే అవకాశం లేనట్టుగా స్పష్టమవుతోంది. ప్రాజెక్టు చరిత్రలో పంటల సాగుకు నీరివ్వకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆ శాఖ అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామగ్రామాన ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయకట్టు గ్రామాల్లోని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
1.50 లక్షల ఎకరాల ఆయకట్టు
నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, మద్దిరాల, నాగారం మండలాల్లో ఎస్సారెస్పీ రెండోదశ కింద 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా ఎస్సారెస్పీ నుంచి గోదావరి జలాలు అందుతుండడంతో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. కానీ, ఈసారి సాగు ప్రశ్నార్థకంగా మారింది.
నీళ్లు ఇవ్వలేం
ఎస్సారెస్పీ ప్రాజెక్టుతో పాటు అనుబంధ రిజర్వాయర్లలో తగినన్ని నీళ్లు లేనందున ఈసీజన్‌లో పంటలకు సాఉనీళ్లు వదలలేం. రైతులు గమనించి సహకరించాలి. ఈ విషయమై నియోజకవర్గంలోని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం.
– సత్యనారాయణ,
నీటి పారుదల శాఖ, ఈఈ
అడుగంటిన ప్రాజెక్టు
రెండోదశ కాల్వలకు సాగునీరు ఇవ్వలేమని
తేల్చి చెప్పిన ప్రభుత్వం
ఆందోళనలో
ఆయకట్టు రైతాంగం


