సూర్యాపేటటౌన్ : ఉత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాను విద్యాపరంగా అగ్రపథాన నిలిపేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న మూడు రోజుల సమగ్ర వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరానికి గానూ పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో సూర్యాపేట జిల్లా ప్రచేష్ట–1లో స్థానాన్ని సాధించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ విద్యా శాఖ బృందాన్ని అభినందించారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కృత్యాధార బోధన, ప్రయోగాలు, ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్స్ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. చదువుతో పాటు విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించేలా ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కె.అశోక్, సెక్టోరియల్ అధికారులు హరికృష్ణ, రేణుక, సెంటర్ ఇన్‌చార్జి నాగరాణి, జిల్లా రిసోర్స్ పర్సన్లు శ్రీహరి శ్రవణ్, సత్యనారాయణరెడ్డి, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


