భానుపురి(సూర్యాపేట), తుంగతుర్తి : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకగా, తప్పుల్లేకుండా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌తోపాటు తుంగతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన వేర్వేరు సమీక్ష సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని, ఫారాల డిజిటలైజేషన్ ప్రస్తుతం 98.77 శాతానికి చేరుకుందని తెలిపారు. 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సర్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, వివిధ పార్టీల నాయకులు రాజేశ్వరరావు, చల్లమల్ల నరసింహ, ఎండి హబిద్, ఎం.స్టాలిన్, ఎస్.సత్యనారాయణ, కరుణాకర్‌రెడ్డి, కోట గోపి, బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. తుంగతుర్తిలో జరిగిన సమావేశంలో డీటీ కంఠమయ్య, కార్యాలయ సిబ్బంది మహేష్, శ్రవణ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ బి.హరిసింగ్


