ఇబ్బందులు లేకుండా రోగులకు సేవలందిస్తున్నాం
సూర్యాపేటటౌన్ : జిల్లాలో మూత్ర పిండాల వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో పాటు మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. రెండు కిడ్నీలు దెబ్బతింటే డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు కోదాడ, హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలసిస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మూడు కేంద్రాలలో సుమారు 200 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా కేంద్రాలపై ఒత్తడి పెరుగుతోంది. రోగుల సంఖ్యకు తగినట్లుగా బెడ్లు, డయాలసిస్ యంత్రాలు లేకపోవడంతో మరి కొంత మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటులో లక్షల్లో ఖర్చు పెట్టాల్సి రావడంతో పేద, మధ్య తరగతి రోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
మూడు ఆసుపత్రులలో సేవలు
జిల్లాలోని మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ సేవలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని కేంద్రంలో 7 డయాలసిస్ యంత్రాలు అందుబాటులో ఉండగా 63 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో తొమ్మిది యంత్రాల ద్వారా 86 మందికి, కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు యంత్రాల ద్వారా 51 మందికి డయాలసిస్ చేస్తున్నారు. ఆయా కేంద్రాలకు రోగుల తాకిడి అధికం కావడంతో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం షిఫ్టుల్లో డయాలసిస్ చేస్తున్నారు. రోగి పరిస్థితిని బట్టి వారానికి రెండు నుంచి మూడు సార్లు రక్తశుద్ధి చేస్తున్నారు.
జిల్లాలో బెడ్లు పెంచితే ఉపశమనం...
సూర్యాపేట జిల్లాలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య అధికమవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 200 మందికే చికిత్స అందుతుండగా మరో 200 మంది వరకు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య తక్కువగా ఉండడం, ఒక్కో రోగికి డయాలసిస్ చేసేందుకు నాలుగు గంటల సమయం పడుతుండడంతో రోగులు తమ వంతు కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొంత మంది వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉన్నా బెడ్లు దొరక్క రెండు సార్లు చేయించుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు హుజూర్‌నగర్, కోదాడలో అదనపు యంత్రాలు, బెడ్లు ఏర్పాటు చేస్తే రోగుల ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
తుంగతుర్తి, నడిగూడెంలో కేంద్రాలు
జిల్లాలో ప్రస్తుతం మూడు ఆసుపత్రులతో పాటు తుంగతుర్తి, నడిగూడెం ఆసుపత్రులకు సైతం డయాలిసిస్ కేంద్రాలు మంజూరయ్యాయి. తుంగతుర్తి, నడిగూడెంలో ఐదు బెడ్ల చొప్పున మంజూరు చేశారు. ప్రస్తుతానికి ఆయా గ్రామాల్లో ఆస్పత్రి భవనాలు నిర్మిస్తుండటంతో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
పెరుగుతున్న కిడ్నీ బాధితులు సరిపోని ప్రభుత్వ సేవలు
జిల్లాలో మూడు చోట్ల
డయాలసిస్ కేంద్రాలు
బెడ్లు సరిపోక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
లక్షల్లో ఖర్చు వస్తుండడంతో
పేదలపై ఆర్థిక భారం
డయాలసిస్ కేంద్రాల్లో సేవలిలా..
సూర్యాపేట జీజీహెచ్ : 7 బెడ్లు, 63 మంది రోగులు
హుజూర్‌నగర్ ఆసుపత్రి : 9 బెడ్లు, 86 మంది రోగులు
కోదాడ ఏరియా ఆసుపత్రి : 5 బెడ్లు, 51 మంది రోగులు
జిల్లాలో రోజు రోజుకు డయాలసిస్ రోగులు పెరుగుతున్నారు. అందుకు అనుగుణంగా వారికి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలందిస్తున్నాం. ప్రస్తుతానికి మూడు ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు కొనసాగుతున్నాయి. కొత్తగా తుంగతుర్తి, నడిగూడెం ఆసుపత్రులకు డయాలసిస్ కేంద్రాలు మంజూరయ్యాయి. త్వరలో అందుబాటులోకి వస్తాయి.
– డాక్టర్ వెంకటేశ్వర్లు,
డీసీహెచ్‌ఎస్, సూర్యాపేట
జీవన శైలిలో మార్పుతోనే
మారుతున్న జీవన శైలితో ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తపోటు, షుగర్ వ్యాధులు అదుపులో లేకపోవడం, పొగ తాగడం, మద్యపానం సేవించడం, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, ఉప్పు, పొటాషియం ఉన్న ఆహారాన్ని తగ్గంచుకోవడం, వ్యాయామంతో కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.


