సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ స్కీమ్‌ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్, పుప్పాల వీరన్న కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మూల వేతనం నుంచి 1.5 శాతం నగదును మే నుంచి కట్ చేసుకుంటున్నప్పటికీ నేటికి హెల్త్ కార్డులు అమలులోకి రాక పోవడంతో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో సేవలందిస్తున్నా వారు అనారోగ్యం బారిన పడినప్పుడు నాణ్యమైన వైద్య సేవలు పొందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే హెల్త్ స్కీమ్‌ను అమలు చేయక పోతే ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.


