సుందరీకరణ ముందుకు సాగేనా.. | - | Sakshi
Sakshi News home page

సుందరీకరణ ముందుకు సాగేనా..

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

పనులు వేగంగా జరిగేలా చూస్తాను

కోదాడ: కోదాడ పెద్దచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసే పనులు ముందుకు సాగడం లేదు. మూడు శాఖల మధ్య సమన్వయలోపంతో పదేళ్ల క్రితం ప్రారంభమైన పనులు నేటికీ పూర్తికాలేదు. మొదట నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టగా మధ్యలో మున్సిపల్‌శాఖ, మూడోసారి పబ్లిక్‌హెల్త్‌ వారు పనులు చేశారు. తాజాగా వారం రోజుల క్రితం పర్యాటకశాఖ అధికారులు వచ్చి పెద్దచెరువులో బోటింగ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అసలు పనులు ఎవరు చేస్తారు, ఎప్పటికి పూర్తవుతాయో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

దశాబ్దకాలంగా సాగదీత

కోదాడ పెద్దచెరువు పూడిక తీయడంతో పాటు దానిని మినీ ట్యాక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి పదేళ్ల క్రితం అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.5 కోట్లను కేటాయించింది. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో రూ.3.5 కోట్లకు టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నాలుగు సంవత్సరాలు అరకొర పనులు చేసి మధ్యలోనే వదిలేసి వెళ్లాడు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీ నిధులు రూ.8 కోట్లతో పెద్దచెరువు సుందరీకరణతో పాటు ఖానాపురం వైపు మున్సిపల్‌ పార్కును ఏర్పాటు చేసే పనులకు అప్పటి మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నిధుల కేటాయింపు ఆలస్యం కావడం, తర్వాత ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. ఇదే సమయంలో మున్సిపల్‌ అధికారులు రూ. 30 లక్షలతో చెరువుకట్టపై మొక్కలు నాటడం, విద్యుత్‌ దీపాలు, సిమెంట్‌ బెంచీలను ఏర్పాటు చేశారు. రూ.5 లక్షలతో చెరువు కట్టపైకి వెళ్లేందుకు అప్రోచ్‌ రోడ్డును వేశారు. సరైన పర్యవేక్షణ లేక ఇప్పుడు అవన్నీ పనికి రాకుండా పోయాయి.

ముచ్చటగా మూడోసారి

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గతంలో మధ్యలో వదిలేసిన రూ. 8 కోట్ల పనులకు మళ్లీ శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు. ఆరు నెలల క్రితం కాంట్రాక్టర్‌ జేసీబీతో చెరువుకట్టను శుభ్రం చేయించాడు. పది రోజుల్లోనే పనులను ఆపివేసి వెళ్లాడు. తాజాగా వారం రోజుల నుంచి మళ్లీ పనుల్లో కదలిక మొదలైంది. కట్టను శుభ్రం చేయడంతో పాటు కట్టపై ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు నీటిపారుదల శాఖకు తెలియకుండానే పబ్లిక్‌హెల్త్‌ వారు చేస్తున్నట్లు సమాచారం.

కోదాడ పెద్దచెరువు కట్టకు ఏర్పాటు

చేస్తున్న ర్యాంప్‌

కోదాడ ట్యాంక్‌బండ్‌తో పాటు సుందరీకరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటాను. సోమవారం చెరువు కట్టను స్వయంగా పరిశీలించాను. రెండు మూడు రోజుల తరువాత అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వేగంగా పనులు పూర్తిచేయిస్తాను.

– నలమాద పద్మావతి, ఎమ్మెల్యే కోదాడ

నత్తనడకన కోదాడ పెద్ద చెరువు

అభివృద్ధి పనులు

మినీ ట్యాంక్‌బండ్‌ ఏర్పాటుకు

పదేళ్ల క్రితం శంకుస్థాపన

ప్రభుత్వ శాఖల మధ్య

సమన్వయ లోపం

అసలు పనులు ఎవరు చేస్తారో తెలియక తికమక

నాలుగోశాఖ రంగప్రవేశం..

ఇప్పటి వరకు మూడు ప్రభుత్వ శాఖలు చేపట్టిన పనులు ముందుకు సాగక పోగా తాజాగా వారం రోజుల క్రితం పర్యాటకశాఖ అధికారులు కోదాడ పెద్దచెరువును సందర్శించారు. కట్ట సుందరీకరణతో పాటు చెరువులో బోటింగ్‌ షికారుకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. కోదాడకు చెందిన విశ్రాంత అధికారితో పాటు ప్రజాప్రతినిధికి పీఏగా పని చేస్తున్న వ్యక్తికి పర్యాటకశాఖ ప్రాంచేజీ ఇచ్చి పెద్దచెరువులో బోటింగ్‌ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా అన్ని శాఖలను సమన్వయ పరిచి పనులు సక్రమంగా జరిగేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement