మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయంలో గణపతిపూజ, పుణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన అనంతరం గోపూజ జరిపారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ, భక్తులు పాల్గొన్నారు.
బాధితుల సమస్యలు పరిష్కరించాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని ఎస్పీ నరసింహ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. బాధితుల సమస్యలు విన్న ఎస్పీ వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులుతో ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలని సూచించారు.
జానపద కళాకారుల
సంక్షేమానికి పోరాటం
భానుపురి(సూర్యాపేట) : జానపద కళాకారుల సంక్షేమం కోసం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం సంఘం జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారుల కోసం సంక్షేమ నిధి, వృద్ధ కళాకారులకు పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం మహిళా విభాగం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గుండ్ల ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగన్న, కోశాధికారి మేకల నారాయణ, మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు సల్గుటి విజయశ్రీ, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వీరు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పుల నాగార్జున, కోశాధికారి చింతకుంట్ల వీరన్న, మహిళా అధ్యక్షురాలు ఆకారపు జయ, ప్రధాన కార్యదర్శి వెన్న కవిత, కోశాధికారిగా వడ్డె మౌనిక పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడికి
నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు పంచామృతాభిషేకం చేశారు. క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాలలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


