చికిత్స పొందుతూ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ మృతి

Jul 28 2026 1:42 AM | Updated on Jul 28 2026 1:42 AM

నిడమనూరు : అప్పుల బాధతో గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన కొంపెల్లి సైదులు(50) ఇటీవల అప్పు చేసి అర ఎకరం పొలం కొనుగోలు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. సాయంత్రం పొలం నుంచి అతడి భార్య వచ్చి చూసి చుట్టుపక్కల వారి సహాయంతో 108 అంబులెన్స్‌లో నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి..

కేతేపల్లి : ఇరవై రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు ఊర యాదగిరి(53) ఈ నెల 7న కేతేపల్లిలోని ఎస్సీ కాలనీ సమీపంలో 65 నంబర్‌ జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయపడ్డాడు. చికిత్స నిమ్తితం కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మద్దతు ధర

కల్పించడంలో విఫలం

మిర్యాలగూడ : రైతులు పండించే పంటలకు మద్తు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని అన్నారం గ్రామంలో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతును రాజు చేస్తామన్న ప్రభుత్వాల మాటలు నీటిమూటలే అయ్యాయన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన నల్లగొండలో నవంబర్‌ నెలలో రైతు సంఘం జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఈ సభలకు రైతులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డబ్బికార్‌ మల్లేష్‌, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మంగారెడ్డి, రవినాయక్‌, అప్పారావు, కాంతారెడ్డి, ఉమాకాంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కోటిరెడ్డి, బెనర్జీ, కన్యానాయక్‌, తదితర రైతులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులో

బంగారు ఆభరణాలు చోరీ

కొండమల్లేపల్లి : ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటన సోమవారం కొండమల్లేపల్లి బస్టాండ్‌లో జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు దేవరకొండకు వెళ్తూ.. మార్గమధ్యలో కొండమల్లేపల్లి బస్టాండ్‌కు చేరుకుంది. కొండమల్లేపల్లికి చెందిన జక్క పుష్పలత, నాంపల్లి మండలం దేవత్‌పల్లికి చెందిన కుందారపు అనసూయ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు మహిళల వద్ద హ్యాండ్‌బ్యాగ్‌లను తస్కరించారు. ఆ బ్యాగుల్లో ఆరు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధిత మహిళలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement