కోదాడరూరల్ : వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం గణపవరం స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. గణపవరం, ఎర్రవరం, రాలక్ష్మీపురం, బీక్యాతండా, తొగర్రాయి, కాపుగల్లు గ్రామాల చెందిన రైతులు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పొట్టా కిరణ్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో ఎన్నెస్పీ ఆయకట్టుకు సాగునీరు రాక రైతులు బోర్ల కింద సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా సరిగా లేక పోవడంతో బోరు కింద వరి నాట్లు వేసే పరిస్థితి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూరియా అందక, మార్కెట్‌లో ధాన్యం అమ్ముకోలేక విద్యుత్ సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని విమర్శించారు. రూరల్ ఎస్‌ఐ యాకూబ్ ఆందోళన కారులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. కార్యక్రమంలో దొంగల లక్ష్మీనారాయణ, బెల్లంకొండ బ్రహ్మం, వరదరావు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బాలేబోయిన వేలాద్రి, అన్నెం అంజిరెడ్డి, చంద్యా తదితరులు పాల్గొన్నారు.


