హుజూర్‌నగర్ : అర్హలైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు అందించడంతో పాటు అనర్హులను తొలగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కేవైని తప్పనిసరి చేసింది. రెండేళ్లుగా సాగుతున్న ఈ కార్యక్రమం ప్రారంభంలో వేగవంతంగా జరుగగా క్రమంగా మందగించింది. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో ఈ కేవైసీ 83శాతం మాత్రమే పూర్తయ్యింది. ఈ నెల 31లోగా ఈ–కేవైసీ చేయించుకోక పోతే రేషన్ కార్డులు రద్దవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
3.55 లక్షల కార్డులు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 610 రేషన్ దుకాణాలు ఉండగా వాటి పరిధిలో మొత్తం 3,55,057 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ, అన్నపూర్ణ, ఆహార భద్రత కార్డులు కలిపి మొత్తం 9,85,061 యూనిట్లు ఉన్నాయి. వీరి కోసం ప్రతినెలా 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 8.17 లక్షల మంది(83శాతం) ఈ కేవైసీ చేయించుకున్నారు. మిగిలిన 17 శాతం మంది ఈ నెలాఖరు లోగా చేయించుకోవాల్సి ఉంది.
ఐదు రోజులే గడువు
ఈ–కేవైసీ ప్రక్రియను రాష్ట్రంలో ఎక్కడైనా చేయించుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు మాత్రం ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా ఈ కేవైసీ చేయించుకోకపోతే వారికి రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. రేషన్ డీలర్లకు సైతం కమీషన్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండడంతో రేషన్ కార్డు దారులు ఈ–కేవైసీ కోసం రేషన్ దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం జూలై నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ పూర్తయినప్పటికీ ఈ–కేవైసీ కోసం దుకాణాలు తెరిచే ఉంచాలని అధికారులు డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఫ 31వరకే అవకాశం
ఫ చేయించుకోకుంటే రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం


