ప్రభుత్వ భవనాలే ఎందుకు కూలుతున్నయ్?
కోదాడ: కోదాడ పట్టణ నడిబొడ్డున విశాలమైన ఆవరణలో 100 మంది సిబ్బంది ఉండడానికి ఏర్పాటు చేసిన పోలీస్ క్వార్టర్స్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. నాణ్యత లేకుండా నిర్మించడంతో కొన్ని సంవత్సరాలకే శిథిలమై పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంతో అందులో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ఇది జరిగి నాలుగైదు సంవత్సరాలు అవుతున్నా వాటిని కూల్చి కొత్తవాటిని నిర్మించే విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతో వసతి లేక అద్దె ఇళ్లకోసం పోలీస్ సిబ్బందికి నిత్యం వెతుకులాట తప్పడం లేదు.
రెండు విడతల్లో క్వార్టర్స్ నిర్మించినా..
కోదాడ టౌన్ పోలీస్‌స్టేషన్ దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. గతంలో ఇక్కడ ఎస్‌ఐ స్థాయి అధికారి మాత్రమే ఉండేవారు. 25 ఏళ్ల క్రితం పోలీస్ స్టేషన్‌కు తూర్పువైపు పోలీస్ సిబ్బంది ఉండేందుకు నాలుగు క్వార్టర్స్ నిర్మించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొద్ది సంవత్సరాలకే అవి శిథిలావస్థకు చేరాయి. వాటిని కూల్చివేసి కొంత స్థలాన్ని ఖాళీగా ఉంచారు. జాతీయ రహదారి వైపు క్వార్టర్ల స్థానంలో పోలీస్ పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్ వెనుక వైపు పాత క్వార్టర్స్ ముందు ఖాళీ స్థలం ఉండడంతో 15 ఏళ్ల క్రితం మొదటిసారి రెండు అంతస్తుల్లో ఒక్కోదానిలో 8 కుటుంబాలు ఉండేలా క్వార్టర్స్ నిర్మించారు. రెండవసారి కూడా మరో 8 క్వార్టర్స్ నిర్మించారు. ఇవి పట్టుమని పదేళ్లు కూడా పని చేయలేదు. స్లాబ్ పెచ్చులు ఊడిపడడం, కంటె గోడలు కూలడం, డ్రెయినేజీ పనిచేయక పోవడంతో వాటిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం టౌన్ పోలీస్‌స్టేషన్ చుట్టూ ఈ శిథిల భవనాలు ఉత్సవ విగ్రహాల్లా కనిపిస్తున్నాయి.
అద్దె ఇళ్లలో సిబ్బంది
పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న క్వార్టర్స్ సక్రమంగా ఉంటే వీటిలో 40 నుంచి 50 పోలీస్ కుటుంబాలు నివాసం ఉండవచ్చు. పోలీసులకు రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీలు పడుతుంటాయి. ఇక్కడ తమ కుటుంబాలు ఉంటే ఇబ్బంది ఉండదని, బయట వారిని ఒంటరిగా ఉంచడం ఇబ్బందిగా ఉందని వారు వాపోతున్నారు. బయట అద్దెలు కూడా ఎక్కువగా ఉండడంతో తమకు భారంగా మారిందని వారు అంటున్నారు. రెండేళ్ల క్రితం వీటి నుంచి ఖాళీ చేయించిన అధికారులు కొత్తవాటి నిర్మించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికై నా పాత క్వార్టర్స్‌ను కూల్చివేసి కొత్తవాటిని నిర్మించాలని వారు కోరుతున్నారు.
కోట్ల రూపాయల ప్రజాధనంతో పక్కాగా నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు పట్టుమని పదేళ్లు కూడా మన్నికగా ఎందుకు ఉండడం లేదు. సామాన్యులు కట్టుకున్న ఇళ్లు 40 నుంచి 50 సంవత్సరాలైన ఎందుకు చెక్కు చెదరడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోదాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్మించిన క్వార్టర్స్ 20 సంవత్సరాల వ్యవధిలోనే రెండుసార్లు ఎందుకు శిథిలావస్థకు చేరుకున్నాయి.. దీనికి కారణమైన కాంట్రాక్టర్స్, ఇంజనీర్లపై కనీస చర్యలు తీసుకున్నారా.. అంటే సమాధానం దొరకదు. కోదాడ ఎన్‌ఎస్‌పీ స్థలంలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన గెస్ట్‌హౌస్ ఇప్పటికి చక్కుచెదరకుండా ఉంది. అంటే నేటి భవనాల నాణ్యత నేతిబీరలోని నెయ్యిచందంగా మారిందని పలువురు అంటున్నారు.
శిథిలావస్థకు చేరిన కోదాడ పోలీస్ క్వార్టర్స్
ఫ సిబ్బందిని ఖాళీ చేయించి ఐదేళ్లు
ఫ అతీగతిలేని కొత్త క్వార్టర్స్ నిర్మాణం
ఫ ఇబ్బంది పడుతున్న పోలీసులు
ఫ కురుస్తున్న భవనంలోనే
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కొనసాగింపు
ఈ చిత్రం కోదాడలోని ఎన్‌ఎస్‌పీ క్వార్టర్స్‌లో
పదేళ్ల క్రితం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన
ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్. ఇది 60 ఏళ్ల క్రితం సిమెంట్
రేకులతో నిర్మించిన క్వార్టర్స్ కావడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఫలితంగా చిన్నపాటి వర్షానికి కూడా స్టేషన్ కార్యాలయం కురుస్తుంది. దీంతో పోలీసులు రేకులపై టార్పాలిన్ పట్టాలు కప్పి
ఉంచారు. అయితే పదేళ్ల క్రితమే కొత్త భవనం నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు.


