ఫ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో
రైతులకు అవగాహన
ఫ అందుబాటులో ఉంచిన విత్తనాలు
ఫ లక్ష ఎకరాలపైనే సాగు అంచనా
భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా యంత్రాంగం ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక రూపొందించింది. దాదాపు లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ యేడు ఆరుతడి పంటల సాగుకు అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు వివిధ ఆరుతడి పంటల విత్తనాలకు కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచింది. ఈ పంటల సాగు వైపు మొగ్గు చూపేలా రైతులకు గ్రామస్థాయి నుంచే వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఏటా ఐదు లక్షల ఎకరాల వరకు సాగయ్యే వరిపంట ఈ సారి 2 లక్షల ఎకరాలకు మించి సాగు కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
గత అంచనాలు తారుమారు
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 5,80,729 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో అత్యధికంగా ఏటా మాదిరిగానే వరి 4,73,656 ఎకరాలు ఉంటుందని, పత్తి 97,566 ఎకరాలు, ఆరుతడి పంటలైన జొన్నలు, మొక్కజొన్న, కంది, పెసర, మినుములు, వేరుశనగ కలిపి 6,852 ఎకరాల్లో రైతులు సాగు చేయొచ్చని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో ఈ అంచనాలు తారుమారు అయ్యాయి. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు తిరిగి అంచనాలు రూపొందించారు. ఈ క్రమంలో భారీగా ఆరుతడి పంటల సాగు పెరగనుంది. 6,852 ఎకరాల నుంచి 1,40,121 ఎకరాల వరకు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందులో జొన్నలు 10 ఎకరాల నుంచి 6,293 ఎకరాలు, కంది 3,927 నుంచి 1,03,190 ఎకరాలకు, పెసర 2,374 నుంచి 13,756 ఎకరాల వరకు, మినుములు 22 ఎకరాల నుంచి 16,882 ఎకరాల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే సాగైన పంటలు ఇలా..
ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనల్లో జిల్లాకు భారీగా ఆరుతడి విత్తనాలు అవసరం ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే జిల్లాలో వరి 46,301 ఎకరాల్లో, కంది 1,195 ఎకరాలు, పెసర 1,218 ఎకరాలు, వేరుశనగ 123 ఎకరాలు, పత్తి 81,607 ఎకరాల్లో సాగైంది. ఆరుతడి పంటలు 2,536 ఎకరాల్లో సాగుకాగా.. మరో 1.37 లక్షల ఎకరాల వరకు సాగు కానుంది.
కావాల్సిన విత్తనాలు
అందుబాటులో ఉన్న
విత్తనాలు (క్వింటాళ్లలో..)
కంది 245.84
పెసర 103.06
మినుములు 110
జొన్నలు 95
వివిధ కూరగాయల
విత్తనాలు 16


