ఆత్మకూర్ (ఎస్): ఆత్మకూర్(ఎస్) మండలంలో వన మహోత్సవం లక్ష్యం నీరుగారిపోతుంది. ఏ గ్రామానికి వెళ్లి చూసినా రోడ్డును ఆనుకుని గుంతలు తీస్తూ మొక్కలు నాటడం కనిపిస్తోంది. ఇప్పటికీ పలు విడతల్లో నాటిన మొక్కల్లో కనీసం ఒక్క శాతం కూడా బతికిన దాఖలాలు లేవు. మొక్కలు నాటి ఫొటోలు దిగేందుకు ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు వాటిని సంరక్షించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రోడ్ల వెంట విద్యుత్ వైర్ల కింద నాటడం.. మరికొన్ని గ్రామాల్లో ప్రధాన రహదారలకు ఆనుకుని గుంతలు తీసి నాడడంతో అవి పెరిగిన కొన్ని రోజులకే నరికేయాల్సి వస్తోంది. ఇక, ఎస్సారెస్పీ కాలువ రోడ్లు, బంజరు భూములు ప్రభుత్వ భూముల్లో మొక్కలు అంతంత మాత్రంగానే నాటి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
టార్గెట్ 1.40 లక్షలు
వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది మండల వ్యాప్తంగా 1.40లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే 16 విడతల్లో నాటగా 17వ విడత కార్యక్రమానికి ఎల్‌నినో ప్రభావంతో కాస్త ఆలస్యమవుతోంది. అయినప్పటికీ మొక్కలు నాటేందుకు మండల వ్యాప్తంగా ఉపాధి సిబ్బంది గుంతలు తీస్తూ కొన్నిచోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక సిబ్బంది, కూలీలు మొక్కలు నాటి నీళ్లు పోయడం లేదు. ఫలితంగా ఎక్కడికక్కడ మొక్కలు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాధనం వృథా కాకుండా వన మహోత్సవాన్ని పకడ్బందీగా కొనసాగించాలని మండల వాసులు కోరుతున్నారు.
ఫ రహదారులకు దగ్గరగా మొక్కలు
ఫ సంరక్షణ బాధ్యతలు మరిచిన సిబ్బంది
ఫ నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం


