చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని స్పందన జూనియర్ కళాశాలలో చట్టాలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కళాశాలలో సోదరభావంతో మెలగాలని, ర్యాగింగ్ భూతాన్ని తరిమి వేయాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా వెట్టిచాకిరీ వ్యవస్థ రద్దు, బాల కార్మిక వ్యవస్థ నిషేధం, బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ నామినేటేడ్ సభ్యులు గుంటూరు మధు, నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ కనకరత్నం, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.


