14 ఏళ్లు నిండిన ప్రతి బాలికకు ఈ హెచ్‌పీవీ టీకాను తప్పనిసరిగా వేయించాలి. సోషల్ మీడియాలో వచ్చే అపోహలను తల్లిదండ్రులు నమ్మవద్దు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. క్యాన్సర్ నివారణకు ఇది ఎంతో సురక్షితమైనది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం.
–డాక్టర్ పెండెం వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ
సూర్యాపేట టౌన్ : జిల్లాలో బాలికలకు అందిస్తున్న హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. జిల్లాలో 14 ఏళ్లు నిండిన 9,567 మంది బాలికలకు టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 5,274 మందికి (55 శాతం) మాత్రమే టీకా అందించారు. జూలై నాటికే ఈ టార్గెట్ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ ఈ గడువును మరో మూడు నెలలు (సెప్టెంబర్ వరకు) పొడిగించింది.
వ్యాక్సిన్‌పై అవగాహన లోపం
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వికల్ క్యాన్సర్) నివారణకు ప్రభుత్వం ఈ టీకాను ఉచితంగా అందిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్ ధర రూ.6,000 నుంచి రూ.10,000 వరకు ఉంది. ఇంత ఖరీదైన టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, అపోహలు, అవగాహన లోపం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వేయించడానికి ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఉచిత వ్యాక్సిన్‌పై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో వైద్యాధికారులు కొంతమేర విఫలమయ్యారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభ్యం
ఈ టీకా జిల్లాలోని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితోపాటు కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి ఏరియా ఆస్పత్రులు, నడిగూడెం సీహెచ్‌సీ, 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంది. లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేసేందుకు ఆరోగ్య సిబ్బంది పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఫ బాలికలకు హెచ్‌పీవీ టీకా
వేయించేందుకు ఆసక్తి చూపని తల్లిదండ్రులు
ఫ 9,567 మందికి గానూ
ఇప్పటివరకు 5,274 మందికే టీకా
ఫ మరో మూడు నెలలు గడువు పెంపు
ఫ పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ


