హుజూర్‌నగర్ , చిలుకూరు : కోదాడ– జడ్చర్ల (ఎన్‌హెచ్–167) జాతీయ రహదారిపై రాత్రి వేళల్లో ప్రయాణం ప్రయాసగా మారుతోంది. రహదారి మధ్యలో ఉన్న లైట్లు వెలగకపోవడంతో రోడ్డంతా చీకటిమయంగా మారుతోంది. పదిహేను రోజులుగా వీధిలైట్లు బంద్ కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోంది.
మూన్నాళ్ల ముచ్చటగా మున్సిపల్ వెలుగులు
హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ దీపాలు పక్షం రోజులుగా పనిచేయడం లేదు. మొదట్లో కాస్త మెరిసిన ఈ లైట్లు.. ఇప్పుడు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటి కారణంగా రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు. సమస్య పరిష్కారానికి నేషనల్ హైవే అధికారులను కలవాలో, మున్సిపల్ అధికారులను ఆశ్రయించాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.
సమన్వయ లోపం..
మరోవైపు చిలుకూరు బస్టాండ్ సెంటర్ వద్ద పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఇక్కడ రెండు రోజులు లైట్లు వెలిగితే, మరో రెండు రోజులు ఆగిపోతున్నాయి. ఇప్పటివరకు ఈ డివైడర్ లైట్ల నిర్వహణను జాతీయ రహదారి అధికారులే చూసుకున్నారు. అయితే వారి కాంట్రాక్ట్ గడువు ముగిసిందని, ఇకపై నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీ చూసుకోవాలని హైవే అధికారులు చెబుతున్నారు. కానీ, కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తాయనే నెపంతో తమకు సంబంధం లేదని పంచాయతీ పాలకవర్గం చేతులెత్తేసింది. ఇరు వర్గాల మధ్య సరైన సమన్వయం లేకపోవడమే ఈ చీకట్లకు కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల పట్టింపులేనితనం, శాఖల మధ్య వివాదాల వల్ల రాత్రి వేళల్లో ప్రధాన బస్టాండ్ సెంటర్లు చీకటి నిలయాలుగా మారుతున్నాయి. సంబంధిత జాతీయ రహదారి, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి, సమన్వయంతో వీధిలైట్లకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
ఫ హుజూర్‌నగర్, చిలుకూరుల్లో
హైవేపై వెలగని వీధి లైట్లు
ఫ అధికారుల మధ్య సమన్వయ
లోపంతో ప్రయాణికుల అవస్థలు
ఫ తరచూ జరుగుతున్న ప్రమాదాలు
ఫ పట్టించుకోని యంత్రాంగం


