పునర్విభజనలో బీజేపీ కుట్ర | - | Sakshi
Sakshi News home page

పునర్విభజనలో బీజేపీ కుట్ర

Jul 21 2026 2:06 AM | Updated on Jul 21 2026 2:06 AM

చౌటుప్పల్‌ : ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీరాఘవులు విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను ఒక నియోజకవర్గంగా, అనుకూలంగా లేని నియోజకవర్గాలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్‌ ద్వారా పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని, ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో బిహార్‌, అస్సాం, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలలో ఎస్‌ఐఆర్‌ ద్వారా అనేక మంది అర్హుల ఓట్లు తొలగించబడ్డాయని, ఆయా రాష్ట్రాలలో ఎస్‌ఐఆర్‌తో బీజేపీ విజయం సాధించిందని, ప్రస్తుతం తెలంగాణలోనూ అదే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఓటుహక్కు రాజకీయ పార్టీలకు చెందిన అంశం కాదని, ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని గుర్తుచేశారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అంశం రాజ్యాంగబద్దమైన ప్రక్రియే అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ చర్చ జరుగుతోందన్నారు. ఎస్‌ఐఆర్‌తో అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే లక్ష్యమైతే సీపీఎం సైతం పూర్తిగా మద్దతు ఇస్తుందని, కానీ ప్రస్తుత ప్రక్రియ వెనుక 2020 ఎన్నికలే లక్ష్యంగా ప్రక్రియ కొనసాగుతుందన్నారు. బీజేపీకి పడని ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఐఆర్‌ను వినియోగించుకుంటుందని తెలిపారు. ఎస్‌ఐఆర్‌ను ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీపీఎం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎలాంటి లోపాలుగానీ, తొలగింపులుగానీ ఉంటే అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి.జహంగీర్‌, నాయకులు ఎండి.పాష, పైళ్ల ఆశయ్య, కె.నర్సింహ్మ, ఎం.బాలరాజు, కె.మల్లేశం, బూర్గు కృష్ణారెడ్డి, గుంటోజు శ్రీనివాసచారి, గంగదేవి సైదులు, పెంటయ్య, రాగీరు కృష్టయ్య, పల్లె మధుకృష్ణ, స్వామి, రామేశ్వరి, వెంకటేష్‌, రాజయ్య, యాదిరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

చౌటుప్పల్‌లో ఎస్‌ఐఆర్‌పై అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement