భానుపురి(సూర్యాపేట) : జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 4,15,509 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయని, ప్రస్తుతం 17,647 డొమెస్టిక్ సిలిండర్లు, 552 కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే వినియోగదారులకు డెలివరీ చేస్తున్నట్లు వివరించారు. కమర్షియల్ సరఫరాలో ఏర్పడిన కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ను ఎవరైనా కమర్షియల్‌గా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఆందోళనకు గురై అనవసరంగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని కోరారు. సీనియారిటీ ప్రకారం ఏజెన్సీలు గ్యాస్‌ను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి సర్వర్ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై సంబంధిత గ్యాస్ ఏజెన్సీలతో మాట్లాడామని, త్వరలోనే సర్వర్ సమస్య పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ రాము పాల్గొన్నారు.
గ్యాస్ సరఫరాను పర్యవేక్షిస్తున్నాం
గ్యాస్ సిలిండర్ సరఫరాపై మానిటరింగ్ కమిటీ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, వినియోగదారులకు గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మాట్లాడారు. కమర్షియల్ సప్లయ్ కొరత నేపథ్యంలో డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. డొమెస్టిక్ సిలిండర్ల వినియోగంపై గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని వివరించారు. అలాగే జిల్లాలోని సాగునీటి అవసరాల కోసం సాగర్, మూసీ, ఎస్సారెస్పీ స్టేజ్–2 నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి నాగేశ్వరశర్మ, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్‌బాబు, డీఎం రాము తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


