నేటి నుంచి పది పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పది పరీక్షలు

Mar 14 2026 7:38 AM | Updated on Mar 14 2026 7:38 AM

69 కేంద్రాలు.. 12,403 మంది విద్యార్థులు

సూర్యాపేట టౌన్‌ : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది విద్యార్థుల హాల్‌ టికెట్‌ నంబర్లు వేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా ఐదు నిమిషాలు(9.35గంటల) వరకు హాల్‌లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించరు.

జిల్లాలో 357 పాఠశాలలు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 357 ఉన్నాయి. వీటిలో 12,403 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఏడు పరీక్షలు జరగనున్నాయి. ఐదు పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరగుతాయి. భౌతిక, జీవశాస్త్రం రెండు పేపర్లు ఉదయం 9.30గంటల నుంచి 11.30గంటల వరకు ఉంటాయి. ఫీజు చెల్లించలేదని ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకున్నా.. విద్యార్థులకు ఇచ్చిన హాల్‌ టికెట్లను పోగొట్టుకున్నా బీఎస్‌ఈ తెలంగాణ వెబ్‌సైట్‌లో విద్యార్థుల పుట్టిన తేదీ నమోదుచేసి హాల్‌ టికెట్‌ పొందవచ్చు.

పకడ్బందీగా పరీక్షల నిర్వహణ..

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా సెంటర్లకు సీఎస్‌, డీఓలతో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించారు. నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్‌ను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాల నిఘాలో సంబంధిత సీఎస్‌, డీఓలు ప్రశ్నపత్రాల సీల్‌ తీసి, పరీక్ష ముగిసిన తర్వాత అదే చోట జవాబు పత్రాలను సీల్‌ చేసి తపాలా కార్యాలయం ద్వారా కేటాయించిన చిరునామాకు రిజిస్టర్‌ పోస్ట్‌ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement