మున్సిపోల్స్‌కు పటిష్ట బందోబస్తు
ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధన ప్రకారం ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల సామగ్రికి పటిష్ట భద్రత కల్పిస్తాం. ఆయుధ పోలీసుల పహారాలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నాం. అలాగే ఎన్నికల సామగ్రి తరలింపులో ఎన్నికల నిర్వహణ అధికారులతోపాటు రూట్ మొబైల్ సిబ్బంది భద్రతగా ఉంటారు.
ఫ 1,250 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక నిఘా
ఫ ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు
వినియోగించుకోవాలి
ఫ నేటి సాయంత్రం 5గంటలకు
ప్రచారం ముగించాలి
సాక్షి ఇంటర్వ్యూలో
ఎస్పీ నరసింహ
సూర్యాపేట టౌన్ : జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సి పాలిటీలకు ఈ నెల 11న జరగనున్న 2వ సాధారణ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. ఇతర శాఖల సమన్వయంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ నిఘా ఉంచాం. ప్రలోభాలను నిర్మూలించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా కృషిచేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. ఆదివారం ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
నిఘా కోసం ప్రత్యేక బృందాలు
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. అదనపు ఎస్పీలు, డీస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారు. ఐదు మున్సిపాలిటీల్లో 1,250 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులకు గానూ 372 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా 115 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీ కేంద్రాలలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. ప్రతి మున్సిపాలిటీ పరిధికి అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారిగా ఉంటారు. అలాగే ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ విధులు నిర్వర్తిస్తుంది. ప్రతి మున్సిపాలిటీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్ చొప్పున 15 ఫ్లైయింగ్ స్క్వాడ్ విధులను నిర్వర్తిస్తాం. ప్రతి మున్సిపాలిటీకి 2 చొప్పున స్టాటిస్టికల్ సర్వే లైన్స్ టీమ్స్ ఉంటాయి. ప్రతి మున్సిపాలిటీకి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం ఉంటుంది.
సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ
ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలను జిల్లా ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. బందోబస్తు నిర్వహణ మొదలుకుని ఎన్నికల సామగ్రికి భద్రత కల్పించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో గల సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిత్యం నిఘా ఉంటుంది.
1,488 మంది బైండోవర్
అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిని గుర్తించి 311 కేసుల్లో 450 మందిని ముందస్తుగా బైండోవర్ చేశాం. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 1,488 మందిని బైండోవర్ చేశాం. ఎవరు కూడా బైండోవర్ నిబంధన ఉల్లంగించొద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిని హామీ పూచీకత్తు నగదును రూ.5 లక్షల వరకు జరిమానాగా విధిస్తాం. లైసెన్స్ కలిగిన 71 ఆయుధాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాం. 47 కేసుల్లో రూ.2.80 లక్షల విలువైన 496 లీటర్ల మద్యం సీజ్ చేశాం.
కేటాయించిన సిబ్బంది
అదనపు ఎస్పీలు 02
డీఎస్పీలు 04
ఇన్‌స్పెక్టర్‌లు 12
సబ్ ఇన్‌స్పెక్టర్లు 50
ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ 265
కానిస్టేబుల్స్ 760
హోంగార్డులు 152
మహిళా సిబ్బంది 90
స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 05
స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 05
నిబంధనలు పాటించాలి
ఈ నెల 9న సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగిస్తుంది. ఎన్నికల ప్రచార సమయం ముగిశాక అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారం నిర్వహించకూడదు. నిబంధనలు పాటించాలి. ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కోల్పోతారు. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్‌డే గా పరిగణించాలి. ఈ సమయంలో ఓటర్లు కానీవారు, స్థానికేతరులు వార్డుల్లో సంచరించకూడదు. ఉచితాలు, బహుమతులు, డబ్బు మద్యం లాంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవు.
మున్సిపోల్స్‌కు పటిష్ట బందోబస్తు


