మిగిలింది.. ఒక్కరోజే
నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర
భానుపురి, సూర్యాపేట టౌన్ :
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెర పడనుంది. ఒక్కరోజు సమయం మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులకు 612 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా నామినేషన్ వేసిన దగ్గర నుంచి జోరుగా ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను సైతం తమకే ఓటు వేయాలని సెల్‌ఫోన్, సోషల్ మీడియా ద్వారా, నేరుగా కలిసి అభ్యర్థిస్తున్నారు.
ప్రచార రంగంలోకి ముఖ్యులు
● కోదాడ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మూడు రోజులుగా వార్డుల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రచార నిర్వహిస్తున్నారు.
● తిరుమలగిరి మున్సిపాలిటీలో ప్రరచారం హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే మందుల సామేల్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్‌లు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ రంగంలోకి దిగారు. బీజేపీ.. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడెం రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డిలతో ప్రచారం చేయిస్తోంది.
● సూర్యాపేట మున్సిపాలిటీలో పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదితను ప్రకటించగా.. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిలు ఎలాంటి వివాదాలకు తావులేకుండా కలిసి వార్డుల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు అన్నీ తానై వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడే మకాం వేసి వార్డువార్డు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. బీజేపీ మొదటి నుంచి ఇక్కడ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొదటగా అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు చైర్మన్ అభ్యర్థిని సైతం ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
● నేరేడుచర్లలో 15 వార్డుల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించి ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆ పార్టీ తరఫున రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య బాధ్యతలు తీసుకున్నారు.
● హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ స్థానిక నాయకత్వమే ప్రచారం చేస్తోంది. బీఆర్‌ఎస్ తరఫున ఆదివారం మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ప్రచారం చేయగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం ప్రచార రంగంలోకి దిగారు.
నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన
జిల్లాకు చెందిన రాష్ట్ర నీటిపారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం సూర్యాపేటలో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్‌షో నిర్వహించారు. ఇక సోమవారం జిల్లాలోని తిరుమలగిరి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్ మున్సిపాలిటీల్లో ప్రచారం చేయనున్నారు.
ఫ ఐదు మున్సిపాలిటీల్లో
రంగంలోకి అగ్రనాయకులు
ఫ బల ప్రదర్శనతో హోరెత్తిస్తున్న రాజకీయ పార్టీలు
ఫ గెలుపే లక్ష్యంగా
ప్రచారం చేస్తున్న అభ్యర్థులు
4 నుంచి జోరుగా..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు నామినేషన్ వేసిన అనంతరం ప్రచారం మొదలు పెట్టారు. ఈ నెల 4 నుంచి ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. మైకులు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాలు, వాల్ పోస్టర్లతో తమ గెలుపు కోసం వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 11న బుధవారం ఎన్నికలు జరగనుండగా 9వ తేదీ సోమవారం సాయంత్రం 5గంటల వరకు ప్రచారం ముగియనుంది.
మిగిలింది.. ఒక్కరోజే


