పేట అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు తీసుకురానున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సంతోష్‌బాబు చౌరస్తా, పీఎస్‌ఆర్ సెంటర్ మీదుగా శంకర్ విలాస్ నుంచి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్వీన్ స్వీప్ చేయబోతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనని చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలోనే 45 లక్షల మందికి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పేట అభివృద్ధికి సహకరించాలన్నారు. ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి మొరిశెట్టి నివేదికను చైర్మన్‌గా గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రవిబాబు, పెద్దిరెడ్డి రాజా, చకిలం రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్‌యాదవ్, కౌన్సిలర్ అభ్యర్థులు మొరిశెట్టి నివేదిత, గునగంటి హేమ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం
రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


