మేడారం వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం
నార్కట్‌పల్లి : మేడారం జాతరకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన బోడ శేఖర్(32), మేడి స్వామి, పాల మురళి, అమనగంటి వెంకన్న, జిల్లా చిన్నా, దైద అనిల్, కొత్తూరు వెంకన్న కలిసి బుర్ర శివకు చెందిన టాటా ఏస్ వాహనాన్ని అద్దెకు తీసుకొని మేడారం జాతరకు వెళ్లారు. అక్కడ సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని సోమవారం తిరిగి వస్తుండగా.. డ్రైవర్ బుర్ర శివ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి హనుమకొండ జిల్లా పరకాల పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బోడ శేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మేడి స్వామి, పాల మురళికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
నార్కట్‌పల్లికి చెందిన ఒకరు మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
హనుమకొండ జిల్లా పరకాల పరిధిలో ఘటన


