రాజేష్ మృతిపై విచారణ జరిపించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి), మద్దిరాల : కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై పూర్తిస్థాయి వాస్తవాలు బయటికి రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, దీనికి బాధ్యులైన పోలీస్, ఇతర శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తిరుమలగిరి, మద్దిరాల మండల కేంద్రాల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ల రాజేష్ లాకప్ డెత్‌కు కారకుడైన చిలుకూరు ఎస్‌ఐ సురేశ్‌రెడ్డిని సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి తొలగించి, అతడిపై హత్య కేసు నమోదు చేయాలని కోరారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కోదాడ ప్రాంతానికి చెందిన కర్ల రాజేష్‌ను పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపడాని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాజేష్ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అతని కుటుంబానికి కోటి రూపాయాల నష్టపరిహారంతో పాటు ఇంటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కందుకూరి సోమన్న, ఏపూరి సోమన్న, మాజీ ఎంపీపీలు జె.శోభారాణి, కొమ్మినేని సతీశ్, నాయకులు వై.దీన్‌దయాళ్, కడెం లింగయ్య, రాంప్రభు, కొత్తగట్టు మల్లయ్య, సోమన్న, రమేశ్, రామ్మూర్తి, వెంకన్న, బ్రహ్మం, భిక్షం, యాదగిరి పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


