మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం
భానుపురి (సూర్యాపేట) : ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా వెబ్ కాస్టింగ్, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, పీఓలు, ఓపీఓల నియామకం, శిక్షణ, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. నామినేషన్ కేంద్రాలు, స్టేషనరీ, సంబంధిత ఫారాలు, బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లు, వీడియోగ్రఫీ, బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు వంటి ఏర్పాట్లు అధికారులు చూసుకోవాలన్నారు. నామినేషన్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరం వరకు పటిష్ట భద్రత చేపట్టాలని, సిబ్బందికి మరోసారి శిక్షణ ఇప్పించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, మున్సిపల్ కమిషనర్లు హనుమంతరెడ్డి, రమాదేవి, బి. శ్రీనివాస్, నాగరాజు, రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


