మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
సూర్యాపేటటౌన్ : మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మున్సిపాలిటీల్లో బుధవారం నుంచే నామినేషన్ ప్రక్రియ ఉన్నందున సంబంధిత కార్యాలయాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికల విధుల నిర్వహణపై మంగళవారం ఆయన మున్సిపల్ కేంద్రాలలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నందున ఆయా పోలీసు అధికారులు అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. గత ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని ముందస్తుగా బైండోవర్ చేయాలని, వారిపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో లైసెన్స్ కలిగిన ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలన్నారు. ముందస్తుగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ తగిన ఏర్పాట్లు ఉన్నాయా అనేది తనిఖీ చేసుకోవాలన్నారు. పోలింగ్ సామగ్రిని సంభందిత అధికారుల పర్యవేక్షణలో గుర్తించిన వాహనాల్లో తరలించాలన్నారు. వాటికి పూర్తి భద్రత కల్పించాలన్నారు. మున్సిపాలిటీ పౌరులు నమ్మకం కలిగేలా ఫ్లాగ్ మార్చ్ చేపట్టాలని, నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల రవాణా జరగకుండా చూడాలని సూచించారు.
ఫ ఎస్పీ నరసింహ


