చెర్వుగట్టులో భక్తుల విరాళాలు పక్కదారి
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో నిత్య అన్నదానం చేసేందుకు భక్తులు ఇస్తున్న విరాళాలు పక్కదారి పట్టిన విషయం శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవాలయానికి వచ్చే భక్తులకు ఆలయ అఽధికారులు నిత్య అన్నదానం చేస్తున్నారు. అన్నదానానికి భక్తులు ఇచ్చే విరాళాలు సేకరించి వారికి రశీదులు ఇచ్చేందుకు గాను సమాచార కేంద్రంలో పనిచేసే వ్యక్తిని నియమించారు. అయితే గతేడాది డిసెంబర్ 18న చెర్వుగట్టు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.5000 విరాళం అందజేయగా.. విరాళం సేకరించిన వ్యక్తి మరో రశీదుపై కేవలం రూ.1000 అందజేసినట్లు రాసి దేవాలయ అధికారులకు అందజేశాడు. అదేవిధంగా డిసెంబర్ 29న కేతేపల్లికి చెందిన భక్తుడు రూ.2500 విరాళం అందజేస్తే అతడు కూడా రూ.1000 ఇచ్చినట్లు మరో రశీదుపై రాసి దేవాలయ సిబ్బందికి అందజేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఈఓ మోహన్‌బాబును వివరణ కోరగా.. పూర్తి విచారణ చేపట్టి బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రౌడీ షీటర్ హత్య
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం మైలార్‌గూడెం గ్రామ పరిధిలోని హారిహార కాటేజీలో శుక్రవారం రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణంలోని అంగడి బజార్‌కు చెందిన రౌడీ షీటర్ నిశాంత్ ఠాకూర్(32) బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మైలార్‌గూడెం పరిధిలోని హారిహార కాటేజీకి తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అక్కడకు మరొక వ్యక్తి రావడంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రౌడీ షీటర్ నిశాంత్ ఠాకూర్‌ని కత్తితో పొడిచి ఇద్దరు నిందితులు పారిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. నిశాంత్ ఠాకూర్‌పై గతంలో 11 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అన్నదానానికి ఇచ్చిన డబ్బులను తక్కువగా అప్పగించిన సిబ్బంది


