టీవీ సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసు
భువనగిరి : రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్‌లాగా కొనసాగుతోందని, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఇందులో ఏ ఒక్క నాయకుడ్ని బాధ్యులను చేసి అరెస్టు చేయలేదన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంత మంది రాజకీయ నాయకులు అధికారులను బలిపశువులుగా చేస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు, గ్యారంటీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తోడుదొంగల్లా నాటకం ఆడుతున్నాయన్నారు. కాళేశ్వరం నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు అన్నింటిపై విచారణ సీరియల్ లాగా కొనసాగిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పూటకో మాట రోజుకో నాటకం ఆడుతున్నారని అన్నారు. అసలు సూత్రధారులను పట్టుకోవాలే తప్ప అధికారులను బలిపశువులను చేయడం సరికాదన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ భువనగిరి జిల్లా అధ్యక్షుడు అశోక్, నాయకులు కాసం వెంకటేశ్వర్లు, బూర నర్సయ్యగౌడ్, మనోహర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శ


