చేప చర్మంతో కుక్కకు చికిత్స
కోదాడరూరల్ : కుక్కకు అయిన గాయం మానకపోవడంతో కోదాడ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ పి. పెంటయ్య చేప చర్మంతో దానికి చికిత్స చేశారు. వివరాలు.. కోదాడ మండల పరిధిలోని గుడిబండకు చెందిన ఓ జంతు ప్రేమికుడి కుక్క కాలి తోడకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయమైంది. గాయం పరిమాణం పెద్దగా ఉండటం, వారం రోజులవుతున్నా మానకపోవడంతో శుక్రవారం కుక్కను స్థానిక పశువైద్యశాలకు తీసుకొచ్చాడు. గాయాన్ని పరిశీలించిన డాక్టర్ పెంటయ్య దీర్ఘకాలిక గాయాలు, పుండ్ల చికిత్సకు చేప చర్మంతో చేసే వైద్యం గురించి వివరించారు. కుక్క యజమాని ఒప్పుకోవడంతో మార్కెట్‌లో చేప చర్మాన్ని తీసుకొచ్చి దానిని 8 గంటలు సాధారణ సైలెన్‌లో, మరో 8 గంటలు జెంటామైసిన్ యాంటిబయాటిక్ ద్రావణంలో ఉంచి ఆ తర్వాత చర్మాన్ని శుభ్రపరిచి చికిత్స పూర్తి చేశారు. ఈ విధానంతో గాయం త్వరగా మానుతుందని డాక్టర్ పెంటయ్య తెలిపారు. ఈ చికిత్సలో అనంతగిరి మండల పశువైద్యాధికారి డాక్టర్ సురేంద్ర, సిబ్బంది కర్ణ పాల్గొన్నారు.


