నేటి నుంచి జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు

Jan 22 2026 8:29 AM | Updated on Jan 22 2026 8:29 AM

నేటి నుంచి జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు

నేటి నుంచి జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు

పాలకవీడు: మతసామరస్యానికి ప్రతీకై న పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌ సైదన్న దర్గా ఉర్సు గురువారం ప్రారంభంకానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు వక్ఫ్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. దర్గాను దర్శించుకుని అనంతరం సమీపంలోని నాగుల పుట్ట వద్ద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది.

సూర్యోదయానికి ముందే గుసుల్‌..

గురువారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే గుసుల్‌ కార్యక్రమంతో ఉర్సు ప్రారంభంకానుంది. ముజావర్‌ జానీ ఇంటి నుంచి తెచ్చిన పవిత్ర గంధాన్ని బాబా సమాధులపై సమర్పించి నూతన చాదర్‌, దట్టీలు, రకరకాల పూలతో బాబాను అలంకరిస్తారు. బాబా సమాధుల వద్ద ఖవ్వాలీ, డప్పు వాయిద్యాల నడుమ ఉల్సా ఈ సిరత్‌ అల్లా నమాజ్‌ నిర్వహిస్తారు. ఈ ప్రార్థనలు పూర్తయిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

రేపు గంధోత్సవం..

ఈ ఉర్సులో ప్రధాన ఘట్టం శుక్రవారం పవిత్ర గంధోత్సవం. వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనల నడుమ తయారుచేసిన పవిత్ర గంధాన్ని దర్గా పూజారి ఇంటికి చేరుస్తారు. ఉదయాన్నే గంధాన్ని దర్గా సమీపంలోని సందల్‌ఖానాకు తరలించి మతపెద్దల సమక్షంలో ఈద్‌ జుమా నిర్వహిస్తారు. అనంతరం అశ్వంపై జాన్‌పహాడ్‌, కల్మేట్‌తండా, చెరువుతండా గ్రామాల పుర వీధుల్లో గంధాన్ని ఊరేగిస్తారు. ఊరేగింపు పూర్తయిన తర్వాత గంధాన్ని సైదులు బాబా సమాధులపై సమర్పిస్తారు. గంధం ఊరేగింపు కార్యక్రమానికి నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరవుతున్నట్లు మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్‌ తెలిపారు.

దీపారాధనతో ఉత్సవాలకు ముగింపు

శనివారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపారాధ కార్యక్రమం నిర్వహించి ఉర్సు ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.

ఫ గంధోత్సవానికి హాజరుకారున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement