దళితుడిని చంపిన వారిని కాపాడడం దారుణం
కోదాడ: అకారణంగా దళిత యువకుడు కర్ల రాజేష్‌ను పొట్టన పెట్టుకున్న వారిని కాపాడాలనుకోవడం దారుణమని, గడిచిన 55 రోజులుగా తాము శాంతియుతంగా ఽనిరసన వ్యక్తం చేస్తున్నా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి కనీసం స్పందించడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బుధవారం కోదాడలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కర్ల రాజేష్ మృతికి కారణమైన కేసులో ఏ–1గా చిలుకూరు ఎస్‌ఐ సురేష్‌రెడ్డి, ఏ–2గా కోదాడ రూరల్ సీఐ ప్రతాపలింగం ఉన్నారని.. కానీ సీఐ ప్రతాపలింగంను సస్పెండ్ చేసిన అధికారులు ఎస్‌ఐ సురేష్‌రెడ్డిపై మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయన రెడ్డి సామాజికవర్గానికి చెందినవాడు కాబట్టే చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో సూర్యాపేట ఎస్పీ నరసింహను ఏ–4గా, అప్పటి కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డిని ఏ–3గా చేర్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ.. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి దళిత యువకుడిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అఖిలపక్ష నాయకులు కర్ల రాజేష్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మేకల శ్రీనివాసరావు, ములకలపల్లి రాములు, ముత్యాలు, వంగవేటి శ్రీనివాసరావు, ఓరుగంటి ప్రభాకర్, ఎస్‌కే రఫీ, సంజీవ్‌నాయక్, మామిడి అంజయ్య, గోపాల్ యాదవ్, కాంపాటి వీరస్వామి, గొడ్డలి నరసయ్య, వక్కంతుల నరసింహారావు, ఉదయగిరి, పిట్టల బాగ్యమ్మ, యలమర్తి రాము, ఆంజనేయులు, సత్యరాజు, వెంకట్రావ్, శ్రీను, గోపి, నాగరాజు పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


