డ్రగ్స్‌తో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితం గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద పిలుపునిచ్చారు. గురువారం జాతీయ యువజన దినోత్సవం, డ్రగ్స్ ఫ్రి ఇండియా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని కలెక్టర్, ఎస్పీతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు బంగారు భవిష్యత్ నిర్మించుకునేందుకు కలలు కని వాటిని సాకారం చేసుకోవాలన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల మనసు, శరీరం, వ్యక్తిత్వం నిర్వీర్యం చెంది తప్పుడు మార్గాల్లో పయనించేలా ప్రేరేపిస్తాయన్నారు. డ్రగ్ ఫ్రి ఇండియా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
విద్యార్థుల ప్రవర్తన గమనించండి : కలెక్టర్
విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవర్తనపై ఉపాధ్యాయులు, అధ్యాపకులు నిఘా ఉంచాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తున్నారని, అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్య తీసుకోవాలని పేర్కొన్నారు.
డ్రగ్స్ మహమ్మారిని తరమికొడదాం : ఎస్పీ
డ్రగ్స్ మహమ్మారిని తరమికొడదామని ఎస్‌పీ నర్సింహ పిలుపునిచ్చారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను సమాజం నుంచి కూకటి వేళ్లలతో తొలగించాలన్నారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులతో ఎస్పీ ప్రతిజ్ఞ చేపించారు. అలాగే ఫ్లెక్సీపై సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, ఆర్‌డీఓ వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌కుమార్, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద
డ్రగ్స్‌తో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు


