పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలి
భానుపురి (సూర్యాపేట) : పని ప్రదేశంలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ చైతన్య పేర్కొన్నారు. గురువారం సూర్యాపేటలోని ఓ హోటల్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై వేధింపులను అరికట్టడానికి లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం నిర్వాహకులు వినోద్, భవ్య తదితరులు పాల్గొన్నారు.
గుట్ట మాజీ ప్రధానార్చకుడి సందర్శన
అర్వపల్లి: అర్వపల్లిలోని ప్రసిద్ధ శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయాలను గురువారం రాత్రి యాదగిరిగుట్ట దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు ఎన్.లక్ష్మీనర్సింహాచార్యులు సందర్శించారు. జాజిరెడ్డిగూడెం దేవాలయంలో జరిగిన ధనుర్మాస వేడుకల్లో పాల్గొని భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహాచార్యులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, స్థానిక అర్చకులు రాంబాబుఅయ్యంగార్, పవన్‌కుమార్, అనంద్ దీక్షితుల పాల్గొన్నారు.
నేత్రపర్వంగా నృసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమనోహరంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య నిత్యకల్యాణ తంతు పూర్తిచేశారు. అదే విధంగా శ్రీస్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ధనుర్మాసంను పురస్కరించుకుని గోదా దేవికి తిరుప్పావై సేవాకాలం, పాశురాలు, పారాయణాలు పఠించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయా చార్యులు పాల్గొన్నారు.
పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలి


