రైతు భరోసా ఏది..! | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా ఏది..!

Jan 2 2026 12:34 PM | Updated on Jan 2 2026 12:34 PM

రైతు

రైతు భరోసా ఏది..!

రైతుభరోసా ఇవ్వాలి ఆలస్యం చేయకుండా విడుదల చేయాలి

రైతుభరోసా ఇలా..

యాసంగి సీజన్‌ రైతు భరోసా డబ్బులు విడుదల చేయని ప్రభుత్వం

పంట పెట్టుబడులకు ఇబ్బందులు

పడుతున్న రైతాంగం

సాగు భూములకు మాత్రమే

ఇస్తుందని ప్రచారం

పెట్టుబడి సాయం

ఎప్పుడందుతోనని ఎదురుచూపులు

యాసంగి పంట సాగు సమయం పూర్తి కావొస్తోంది. పంటల సాగు పెట్టుబడులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే రైతుభరోసా విడుదల చేస్తే బాగుంటుంది. ప్రతిసారి ఆలస్యం కాకుండా సీజన్‌ ప్రారంభంలోనే ఇవ్వాలి.

– తొట్ల ఉపేందర్‌, రైతు, కొత్తగూడెం

రైతుభరోసా డబ్బులు ఈ యాసంగికి ఇంకా ఇవ్వలేదు. ఈ డబ్బులు ఇస్తే రైతులకు పెట్టుబడులకు ఉపయోగపడుతాయి. ఓవైపు ధాన్యం అమ్మినా డబ్బులు కొందరికి పడలేదు. ఈ రైతుభరోసా రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద పెట్టుబడులకు అప్పు చేయాల్సి వస్తోంది.

– కడపర్తి శ్రీను, రైతు, ఆత్మకూర్‌ (ఎస్‌)

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యాసంగి పంటల సాగు ముమ్మరంగా కొనసాగుతోంది. మరో 10 నుంచి 15 రోజుల్లోనే సాగు పనులు పూర్తి కానున్నాయి. ప్రధానంగా వరి నాట్ల పనులు పూర్తయి సీజన్‌ ముగియనుంది. అక్కడక్కడా వరి కాకుండా ఇతర పంటలను సైతం రైతులు సాగు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏటా రెండు విడతల్లో అందించే రైతుభరోసా.. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి ఇంకా విడుదల చేయలేదు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటల పెట్టుబడులకు డబ్బులు సమయానికి అందడం లేదని వాపోతున్నారు. కాగా ప్రభుత్వం యాసంగి సీజన్‌లో రైతుభరోసా డబ్బులు జమ చేయడంలో మార్పులు తీసుకొచ్చి.. శాటిలైట్‌ ఆధారంగా సాగు భూములకు మాత్రమే డబ్బులు జమ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తమకు రైతుభరోసా డబ్బులు వస్తాయో.. రావోనన్న ఆందోళనలో కర్షకులు ఉన్నారు.

జిల్లాలో 2,70,853 మంది రైతులు

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 8,95,680 ఎకరాల సాగు భూమి ఉంది. 2,70,853 మంది రైతులు ఈ భూమిని సాగు చేస్తున్నారు. అయితే గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ రైతుబంధు పేరుతో ఎకరానికి రూ.5వేల చొప్పున రెండువిడతల్లో పెట్టుబడిసాయం అందించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎకరానికి రూ.15వేలను రెండుసార్లు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ నిధులను ప్రతిఏటా పెంచుతామని మొదటగా ఎకరానికి రూ.6వేలుగా రెండు విడతల్లో రూ.12 వేలను రైతుల ఖాతాలో జమచేస్తామని చెప్పి గత యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,44,423 మంది రైతుల అకౌంట్లలో రూ.232.92 కోట్లను జమ చేసింది. ఈ సమయంలో పది ఎకరాల పైబడి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులను ప్రభుత్వం జమచేయలేదు. వివిధ కారణాలతో పది ఎకరాల లోపు ఉన్న రైతులకు కొందరికి ఈ పథకం కింద నిధులు జమ కాలేదు. ఈ వానాకాలం సీజన్‌లో పంటలను సాగు చేసిన ప్రతి రైతును ఈ పథకాన్ని వర్తింప జేయగా.. 2,87,234 మంది రైతులకు రూ.366.50 కోట్లను అందించారు.

పనులు ముమ్మరం.. పత్తాలేని నిధులు..

జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 3.40 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. మరో 10, 15 రోజుల్లో సాగు అంచనా 4.80 లక్షలను చేరుకోనుంది. ఇతర పంటల్లో కూరగాయలు, వేరుశనగ, పెసర పంటలను రైతులు అంతంత మాత్రంగానే సాగు చేశారు. ఈ సాగు పనుల నిమిత్తం ఒక్కో రైతు వేలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. నవంబర్‌ 15నుంచే విత్తనాల కొనుగోలు నుంచే రైతులకు పెట్టుబడికి డబ్బులు అవసరం కాగా.. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుభరోసా నిధులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులకు వానాకాలం వరి ధాన్యం అమ్మిన డబ్బులు పడకపోవడంతో ఈ యాసంగి సీజన్‌ పెట్టుబడులకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది.

ప్రభుత్వ స్పందన కరువు

రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఈ యాసంగి సీజన్‌ డబ్బులను ఏ సమయంలో ఇస్తారో చెప్పకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శాటిలైట్‌ మ్యాప్‌ ఆధారంగా కేవలం పంటలను సాగు చేసిన రైతులకు మాత్రమే ఈ నిధులు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమకు ఈ యాసంగి సీజన్‌ రైతుభరోసా అందుతుందా..? లేదా..? అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

?

మొత్తం భూమి విస్తీర్ణం : 8,95,680 ఎకరాలు

రైతులు : 2,70,853

2024– యాసంగి

రైతులు : 2,44,423 మంది

రూ.232.00 కోట్లు

2025 – వానాకాలం

రైతులు : 287234

రూ.366.50 కోట్లు

రైతు భరోసా ఏది..!1
1/3

రైతు భరోసా ఏది..!

రైతు భరోసా ఏది..!2
2/3

రైతు భరోసా ఏది..!

రైతు భరోసా ఏది..!3
3/3

రైతు భరోసా ఏది..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement