అర్హులందరికీ పథకాలు అందేలా కృషిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులందరికీ అందేలా ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉద్యోగులు గత సంవత్సరం మాదిరిగానే ఈ నూతన సంవత్సరంలోనూ విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలపై అవగాహన తెచ్చుకుని ఎలాంటి లోటు పాట్లు లేకుండా అర్హతలను బట్టి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి ప్రారంభించిన సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలనూ అధికారులు అందరూ కలిసికట్టుగా విజయవంతం చేశారన్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా ఉద్యోగులందరూ సమష్టిగా ఒక టీం లాగా ఏర్పడి దాని ఆశయాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. విధుల్లో అలసత్వం, లక్ష్యాన్ని చేరుకునే విషయంలో ఏమైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.పరిపాలనలో ఉద్యోగులే బలం, బలగమని అన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 లో భాగంగా సూర్యాపేట జిల్లాను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ఉద్యోగులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కె.నరసింహ, అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి
ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2026 జనవరిని రోడ్డు భద్రత మాసంగా గుర్తించినట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో రెండు వారాలపాటు హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదన్నారు. అనంతరం జరిమానా కూడా విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష, ఆర్టీఓ జయప్రకాశ్ రెడ్డి, ఆర్డీఓలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, వేణుమాధవ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


